తెలంగాణపై
ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు.
తెలంగాణలో పసుపు బోర్డుతో పాటు సమ్మక్క-సారక్క
పేరుతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని బహిరంగ సభ వేదికగా ప్రకటించారు.
తెలుగులో
ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, నా కుటుంబ సభ్యులారా అంటూ తెలంగాణ ప్రజలను
సంబోధించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, పాలమూరు సభ సాక్షిగా
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ములుగు
జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, వన దేవతలు అయిన
సామ్మక్క-సారక్క పేరుపై వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం కేంద్ర
ప్రభుత్వం రూ. 900 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
తెలంగాణలో
ఇవాళ రూ. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పిన ప్రధాని,
కేంద్రం తీసుకుంటున్న చర్యలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో
తెలంగాణ అనుసంధానం మునిపటి కంటే పెరిగిందన్నారు.
దేశంలో
నిర్మించే ఐదు టెక్స్టైల్స్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు.
హన్మకొండలో నిర్మించే టెక్స్టైల్ పార్కుతో
వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు
పెరుగుతాయన్నారు.
ఇనిస్టిట్యూట్
ఆఫ్ ఎమినెన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని గుర్తిస్తామన్నారు.
కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడెక్ట్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. జక్లేర్ కృష్ణ
కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితమిచ్చారు.