ఢిల్లీలో గతవారం చోటుచేసుకున్న రూ.25 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసు మిస్టరీ వీడింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్ అనే వ్యక్తి ఈ భారీ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.ముందుగా ఢిల్లీ చాందినీ చౌక్‌లో రూ.100తో ఒక సుత్తి, రూ.1300తో కట్టర్ కొనుగోలు చేసిన శ్రీవాస్ జంగ్‌పురా చేరుకుని నగల దుకాణానికి కన్నం వేశాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ చరిత్రలో ఇది అతిపెద్ద దొంగతనం అని పోలీసు అధికారులు తెలిపారు.
దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ తెలివితేటలకు పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక చిన్న సుత్తి, ఒక చిన్న కట్టర్‌తోపాటు, శ్రావణం, స్కూడ్రైవర్‌తో ఇంత పెద్ద దొంగతనం చేయడం ఎన్నడూ చూడలేదని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. భారీ దొంగతనం కావడంతో దొంగల ముఠాల పనిగా అనుమానించారు. చివరకు ఒకే వ్యక్తి రూ.25 కోట్ల బంగారం దోచాడని తెలియడంతో పోలీసులు షాకయ్యారు.
గత ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దొంగ శ్రీవాస్ ఢిల్లీ భోగల్‌లోని ఉమ్రావ్ జ్యుయలరీ భవనంపైకి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి బంగారం దాచే స్ట్రాంగ్ రూంకు కన్నం వేశాడు. ముందుగా సీసీటీవీల కేబుళ్లను తొలగించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం శ్రీవాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ నాలుగంతస్తుల భవనం టెర్రస్‌పైకి ఎక్కి, అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూంకు చేరుకున్నట్టు విచారణలో తేలింది.
డ్రిల్లింగ్ మెషిన్‌తో స్ట్రాంగ్ రూం గోడకు కన్నం వేసి అక్కడ ఆభరణాలతోపాటు దుకాణంలోని బంగారం కూడా ఎత్తుకెళ్లాడు. శుక్రవారం శ్రీవాస్‌ను చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి దోచుకెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.