టీడీపీ
అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ రేపు నిరసన దీక్ష చేపట్టనున్నారు.
టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ
నేతలు చెబుతున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో నమోదైన కేసులో
అరెస్టై జుడీషియల్ రిమాండ్ లో ఉన్న
చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే దీక్షకు దిగనున్నారు.
నారా
భువనేశ్వరి కూడా గాంధీ జయంతి సందర్భంగా నిరసన దీక్ష చేపట్టనున్నారు.లోకేశ్,
దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారు.
గాంధీ
జయంతి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు టీడీపీ ముఖ్యనేతలు
వెల్లడించారు. వీరి దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో
తెలుగుదేశం శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నాయి.
సోమవారం సాయంత్రం 7
గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోనే లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని
కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
అమరావతి
రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన 41(ఏ) నోటీసుపై స్పందించిన నారా లోకేశ్, ఈ నెల 4న
విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్, ఆయన సహచరుల్లా వాయిదాలు అడిగే అలవాటు
తనకు లేదన్నారు. పదేళ్లుగా బెయిల్ పై బతుకుతున్నారంటూ సీఎం జగన్, ఎంపీ
విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని
టీడీపీ శ్రేణులకు సూచించారు.