భారత అమెరికా సంబంధాలపై హద్దులు పెట్టడం చాలా కష్టమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. కెనడాతో భారత్ దౌత్యసంబంధాలు సున్నితంగా మారిన సమయంలో అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.
భారత్, అమెరికా దేశాలు ఇప్పడు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములని, ఈ రెండు దేశాల సంబంధాలపై పరిమితి విధించడం చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా సంబంధాలు ఎంత వరకు వెళతాయని చాలా మంది తరచుగా అడుగుతున్నారని ఈ రెండు దేశాల సంబంధాలకు ఒక పరిమితి విధించడం కష్టం అంటూ జైశంకర్ అన్నారు. భారత్ అమెరికాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, అయితే వాటిని అంచనా వేయలేనంత బలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. అందుకే ఆ రెండు దేశాల మధ్య బంధాలను నిర్వచించడానికి కూడా ప్రయత్నించడం లేదని జైశంకర్ తెలిపారు. రెండు దేశాల బంధాలను మరింత పెంచుతూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.
భారత్, యూఎస్ కలసి పనిచేయడానికి తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. బంధాలు మరింత పెంచేందుకు మేం కొత్త విధానాలను అన్వేషిస్తూనే ఉంటామని జైశంకర్ ప్రకటించారు. గత వారం రోజులుగా ఆయన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, యూఎస్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ సభ్యులు, వ్యాపార వేత్తలు, నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు.