ప్రధాని
నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్
విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి
ఉండగా ఎప్పటిలాగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు మర్యాద పూర్వక ఆహ్వానం
పలుకుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ప్రధాని పర్యటనలో
పాల్గొనడం లేదని సమాచారం.
శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్‌నగర్‌కు
చేరుకుంటారు. 2.15 గంటల నుంచి 2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో
పాల్గొంటారు. సుమారు రూ. 13,500 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభిస్తారు.
నాగపూర్-విజయవాడ
ఎకానిమిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నాలుగు వరుసుల రహదారి వరంగల్ –ఖమ్మం-విజయవాడ
నగరాలను కలపనుంది. ఇందుకోసం రూ.6,400 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ కొత్త మార్గం
కారణంగా వరంగల్ –ఖమ్మం మధ్య 14 కిలోమీటర్ల దూరం తగ్గుతుండగా, ఖమ్మం-విజయవాడ మధ్య
27 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
మూడు
గంటల నుంచి నాలుగు గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత మళ్లీ శంషాబాద్ చేరుకుని ప్రత్యేక
విమానంలో దిల్లీ వెళతారు.
సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు
రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాదపు రెండు లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు
కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబందించి కూడా జనసమీకరణ
చేస్తున్నారు.