అవినీతి
నిర్మూలనే లక్ష్యంగా ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తోంది. డీజీపీ రాజేంద్రనాథ్
రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రెండు రోజుల వ్యవధిలో
ముగ్గురు అవినీతి ఉద్యోగులను పట్టుకున్నారు.
రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరితో పాటు
పోలీసు శాఖకు చెందిన ఒకరిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గుంటూరు
జిల్లా నల్లపాడు పోలీసుస్టేషన్ లో నిందితులను అరెస్టు నుంచి తప్పించేందుకు ఎస్ఐ
కట్టా వెంకటయ్య లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి
దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎస్ఐ ఇంటి దగ్గర రూ.40,000 లంచం తీసుకుంటుండగా
పట్టుకున్నారు.
ప్రకాశం
జిల్లా కనిగిరి మండలం సర్వేయర్ అల్లం రంగస్వామి గురవరాజుపేట గ్రామానికి చెందిన రైతు
నుంచి 30 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ ఆధారాలతో సహా పట్టుకుంది. తూర్పు గోదావరి
జిల్లా నల్లజర్ల మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు అల్లు రాంబాబు
తండ్రికి చెందిన భూమిని ఆన్లైన్ మ్యుటేషన్ చేయడానికి దుబ్బచెర్ల వీఆర్వో రూ. 30,000
లంచం అడిగారు. దీనిపై ఏసీబీకి ఫిర్యాదు అందగా రూ. 15,000 లంచం తీసుకుంటుండగా
పట్టుకున్నారు.
అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా
అందుబాటులోకి తెచ్చిన 14400 నంబరుకు ఫిర్యాదు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
పేర్కొన్నారు.