ఖలిస్తానీ
వేర్పాటువాద సిక్కుల ఆగడాలు విస్తరిస్తున్నాయి. కెనడాలో భారతీయ దౌత్యాధికారులను
బెదిరిస్తున్న సిక్కు వేర్పాటువాదులు ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ అదే
వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
యూకేలో భారత
హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, స్కాట్లాండ్ గ్లాస్గో నగరంలోని గురుద్వారా
ప్రబంధక్ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు శనివారం అక్కడికి వెళ్ళారు. అయితే గురుద్వారా
లోపలికి ఆయన వెళ్ళకుండా ఖలిస్తానీ అతివాదులు బైటే అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి
ఒక వీడియో విడుదలైంది.
వీడియోలో
కనిపించిన దృశ్యాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు హైకమిషనర్ కారును గురుద్వారా పార్కింగ్
ఏరియా వద్ద అడ్డగించారు. ఒక వ్యక్తి కారు డోర్‌ను బలవంతంగా తెరవడానికి
ప్రయత్నించాడు. దాంతో హైకమిషనర్ అక్కడినుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు.
ఖలిస్తానీ
వేర్పాటువాదుల ఆగడాలు అక్కడితో ఆగలేదు. భారత హైకమిషనర్‌ను ఆహ్వానించినందుకు
గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వాహకులను సైతం బెదిరించారు. ఈ ఘటన హైకమిషనర్ భద్రతకు
సంబంధించినది కావడంతో, పోలీసు కేసు నమోదయింది.
‘సిఖ్ యూత్ యూకే’
అనేఖలిస్తానీ అనుకూల సంస్థ ఈ దుశ్చర్యకు
పాల్పడింది. గురుద్వారాకు వచ్చే ఏ భారతీయ రాయబారి లేక భారత ప్రభుత్వ అధికారికైనా
ఇదే గతి పడుతుందని ఆ అతివాదులు హెచ్చరించారు. ‘‘భారతీయ అధికారులు గురుద్వారాలోకి
రావడాన్ని నిషేధించాం. వాళ్ళు ఆడుతున్న నాటకాలు మాకు తెలుసు. కెనడాలో ఏం
జరుగుతోందో మాకు తెలుసు. కెనడా ప్రధాని బహిరంగంగానే భారత వైఖరిని ఖండించారు. భారత
దౌత్యాధికారులను బహిష్కరించారు’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై
భారతదేశం తమ ఆందోళనను యూకే ప్రభుత్వానికి తెలియజేసింది.