మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలిక
అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టయిన భరత్ సోనీని ఉరి తీసేయమని అతని తండ్రి డిమాండ్
చేసాడు. మరోవైపు, నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దంటూ స్థానిక బార్ అసోసియేషన్
న్యాయవాదులకు విజ్ఞప్తిచేసింది.
12ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో ఉజ్జయిని
మహాకాళ్ పీఎస్ పోలీసులు ఆటోడ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేసారు. సీసీటీవీ
ఫుటేజ్ పరిశీలనలో బాలిక ఆఖరిసారి అతని ఆటోలో కనిపించింది. ఆటోను పరిశీలించినపుడు
అందులో రక్తపు మరకలు కనిపించాయి.
భరత్ సోనీ తండ్రి ఈ ఘటనపై తీవ్రంగా
స్పందించారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. నా కొడుకుని కలవడానికి నేను ఆస్పత్రికి
వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్‌కీ, కోర్టుకూ కూడా వెళ్ళను. నా కొడుకు నేరం చేసాడు.
అతన్ని ఉరి తీసేయాలి’’ అన్నారు. బాధిత బాలిక తన కుమార్తె లాంటిదేనని ఆవేదన
చెందారు.
మహాకాళుడి పవిత్రక్షేత్రంగా ఉజ్జయిని
నగరానికి ఉన్న గొప్ప పేరును ఈ దుర్ఘటన దెబ్బతీసిందని ఉజ్జయిని బార్ కౌన్సిల్
అధ్యక్షుడు అశోక్ యాదవ్ అన్నారు. నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దని కౌన్సిల్
సభ్యులైన న్యాయవాదులకు ఆయన విజ్ఞప్తి
చేసారు.
పన్నెండేళ్ళ
బాలిక సరైన దుస్తులు లేకుండా రక్తమోడుతూ నగర వీధుల్లో తిరుగుతుంటే ఒక పూజారి ఆమెను
చేరదీసారు. ఆమెకు దుస్తులు కప్పి, ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటన జరిగిన మూడవ రోజులకు పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు. వైద్యపరీక్షల్లో,
బాధిత బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
పోలీసుల
దర్యాప్తులో భాగంగా గురువారం నిందితుణ్ణి ఘటనా స్థలానికి తీసుకువెళ్ళే సమయంలో అతను
పారిపోయే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో అతను గాయపడ్డాడని పోలీసులు వివరించారు.
బాధిత బాలికకు
బుధవారం నాడు ఇండోర్‌లోని ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో మేజర్ సర్జరీ చేసారు. బాలిక
ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోతోంది. ఆమెది సత్నా జిల్లా అని మాత్రం తెలిసింది.
సత్నా జిల్లాలో అదే వయసు గల బాలిక ఒకరు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయింది.
అయితే ఆ బాలిక, ఈ బాలిక ఒక్కరో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ దుర్ఘటన
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని
కాంగ్రెస్ మండిపడింది. ‘‘మైనర్లపై అత్యాచార కేసుల విషయంలో మధ్యప్రదేశ్ దేశంలోనే
అగ్రస్థానంలో ఉంది. 18ఏళ్ళ శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో 58వేల రేప్ కేసులు, 68వేల
కిడ్నాప్ కేసులూ నమోదయ్యాయి. అయినా దేశ ప్రధాని, హోంమంత్రి, బీజేపీ నాయకులు ఎవ్వరూ
నోరు మెదపడం లేదు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే
దుయ్యబట్టారు.