భారత్-కెనడా దౌత్య సమరానికి దారి తీసిన ఖలిస్తానీ
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి భారతదేశం-అమెరికా చర్చించాయి. కెనడా
ఉగ్రవాదుల స్థావరంగా నిలుస్తోందంటూ భారత
విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వద్ద కుండ
బద్దలుకొట్టేసారు.
అంతకుముందు వాషింగ్టన్‌లోని హడ్సన్
ఇనిస్టిట్యూట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ జయశంకర్ ‘‘ఉగ్రవాదులు, అతివాదులు,
హింసను బహిరంగంగా సమర్ధించేవారిని అనుమతించే వైఖరి కెనడాది. తమ దేశ రాజకీయాల్లోని
తప్పనిసరి పరిస్థితుల కారణంగా కెనడా అటువంటి వారందరికీ చోటు కల్పిస్తోంది’’ అని
మండిపడ్డారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వ
ఏజెంట్లే చంపేసారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణను
కొట్టిపారేసిన జయశంకర్, అలా హత్యలు చేయించడం భారత ప్రభుత్వ విధానం ఎన్నడూ కాదని
స్పష్టం చేసారు. ట్రూడో తన ఆరోపణలకు ఆధారాలు ఇప్పటివరకూ చూపలేదు. అయితే, ఫైవ్ ఐస్
నిఘా వ్యవస్థ అందించిన సమాచారమే అది అన్న వార్తలు వెలువడ్డాయి. ట్రూడో ఆరోపణలను
అసంబద్ధమైనవి అంటూ ఖండించిన భారత్, ఉగ్రవాదులకు కెనడా సురక్షిత ప్రదేశంలా
నిలుస్తోందని మండిపడింది.
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్,
కెనడా ప్రధాని చేసిన ఆరోపణలు తమ దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ‘‘మేం
భారత ప్రభుత్వంతో చర్చించాము. కెనడా దర్యాప్తుకు సహకరించాలని అడిగాము’’ అని
వెల్లడించారు. నిజ్జర్ హత్య బాధ్యులను పట్టుకుని తీరాలని స్పష్టంగా చెప్పారు.
దానికి భారత విదేశాంగ మంత్రి జయశంకర్
ఘాటుగానే జవాబిచ్చారు.భారతదేశం దృష్టిలో కెనడా వ్యవస్థీకృత నేరాలకు కేంద్రస్థానం అనీ… ప్రజల
అక్రమ రవాణా, వేర్పాటువాదం, హింస, ఉగ్రవాదం వంటివన్నీ అక్కడ కలిసిపోయాయనీ… ఆయన
వ్యాఖ్యానించారు. ప్రమాదకరమైన భావనలు, ప్రమాదకరమైన వ్యక్తులూ కలిసి పనిచేసుకునే
ఆపరేటింగ్ స్పేస్ కెనడా అని జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ దేశంలో భారత
దౌత్యవేత్తలు సహితం అభద్రతాభావంతో పనిచేస్తున్నారని జయశంకర్ స్పష్టం చేసారు.
నిజ్జర్ హత్య విషయంలో జయశంకర్ భారత
వైఖరిని పునరుద్ఘాటించారు. కెనడా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని
చూడడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేన్నయినా చూడడానికి తలుపులు తెరిచే ఉన్నాయనీ,
అయితే అక్కడ చూడడానికి అసలంటూ ఏదైనా ఉంటే కదా అని ప్రశ్నించారు. మేం ఏది
చూడడానికయినా సిద్ధమే. దేన్ని ఎంచుకున్నా మాకు ఏ అభ్యంతరమూ లేదు… ఏదో ఒక చోట,
ఏదో ఒక చిన్న అభ్యంతరం ఏదో ఒకటి ఉండాలి కదా, అవేవీ లేకుండా దేన్ని చూడాలి?’’ అని
ప్రశ్నించారు.
భారత విదేశాంగ మంత్రి కెనడాను విమర్శించడం
ఇదేమీ మొదటిసారి కాదు. కెనడా ఉగ్రవాద శక్తులకు అండగా నిలుస్తోందనీ, భారత
దౌత్యవేత్తలు బెదిరింపులు ఎదుర్కొంటున్నారనీ, వారి కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయనీ
మండిపడ్డారు. కెనడాలోని వ్యవస్థీకృత నేరాల సూత్రధారుల గురించి భారతదేశం క్రమం తప్పకుండా
సమాచారం ఇస్తూనే ఉందనీ, వారిని
అప్పగించాలంటూ పెద్దసంఖ్యలో అభ్యర్ధనలు పంపించిందనీ గుర్తు చేసారు.
మరోవైపు, ఈ మొత్తం వ్యవహారంలో తామే
నష్టపోతున్నామని అర్ధం చేసుకున్న కెనడా ప్రధాని ట్రూడో, గురువారం నాడు మాట
మార్చారు. భారతదేశం వేగంగా పెరుగుతున్న ఆర్థిక శక్తి అనీ, ప్రపంచ రాజకీయాల్లో
ప్రధాన పాత్రధారి అనీ ప్రశంసించారు. గతేడాది ప్రకటించిన తమ ఇండో పసిఫిక్ వ్యూహం ప్రకారం
భారతదేశంతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని కెనడా చాలా సీరియస్‌గా ఉందంటూ
చెప్పుకొచ్చారు.