వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా
బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న తరుణంలో కృష్ణా
బోర్డు అక్టోబర్ 5న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల
నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు
పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలను కృష్ణా బోర్డు కోరింది. అక్టోబర్ 5 నాటి
సమావేశానికి కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఆ మేరకు రెండు
రాష్ట్రాల ఈఎన్‌సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో
నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులపై
కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల
ఈఎన్‌సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు.
ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా
జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల
చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు
జారీచేసింది.
ఆ కమిటీ ఆగస్టులో రెండోసారి సమావేశమైంది.
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్నందున.. తాగునీటి అవసరాల కోసం
నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రాష్ట్రాల ప్రతిపాదనలపై
సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను జారీచేయలేదు. ఆ
విషయాన్ని బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే
తీసుకెళ్లారు.
వెంటనే త్రిసభ్య కమిటీ
సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులకు సిఫార్సు
చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు.
ఫలితంగా అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది.