స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా కేంద్ర
ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) అవార్డుల్లో రెండు ఆంధ్రప్రదేశ్‌కు
లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన పెల్లకూరు సాత్విక, అనంతపురం జిల్లాకు చెందిన
కురబ జయమారుతి… రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను శుక్రవారం నాడు స్వీకరించారు.
ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తలుగా
సమాజానికి అందించిన సేవలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో
పోషించిన పాత్రకు గాను సాత్విక, జయమారుతి ఈ పురస్కారాలు కైవసం చేసుకున్నారు.
సాత్విక, జయమారుతిలు బాలికా విద్య,
డిజిటల్ ఇండియా, డిజిటల్ అక్షరాస్యత, పీఎం ఉజ్వల యోజన, పీఎం జీవనజ్యోతి యోజన, పీఎం
జీవనబీమా యోజన వంటి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసారు. కోవిడ్ మహమ్మారి
సమయంలో చురుగ్గా సేవలందించారు. లాక్‌డౌన్ సమయంలో పేదప్రజలకు సేవలందించారు.
జయమారుతి అనంతపురం శ్రీకృష్ణదేవరాయ
విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థి. కరోనా కాలంలో 1700 మాస్కులు స్వయంగా తయారు
చేసి అనంతపురం చుట్టుపక్కల గ్రామాల్లో పంచిపెట్టారు. పర్యావరణ పరిరక్షణ
కార్యక్రమాల్లో భాగంగా 120 మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాల ద్వారా 238 యూనిట్ల
రక్తం సేకరించారు. రూ.23వేలు విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని సాయుధ బలగాల్లో
పనిచేసి అమరులైన వారి కుటుంబాలకు సహాయంగా అందించారు. 2020లో ఎన్ఎస్ఎస్
రాష్ట్రస్థాయి పురస్కారాన్నీ పొందారు.
విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పరిధిలోని
విద్యార్థిని సాత్విక లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలకు సేవలందించారు. ఆహార పదార్ధాలు,
దుస్తులు, ఇతర పదార్ధాలు సేకరించి పంచిపెట్టారు. స్వచ్ఛభారత్ ప్రచారం, ఎయిడ్స్‌పై
అవగాహన కల్పించడం, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించడం వంటి సమాజసేవా
కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో
భాగంగా 1500 మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాల ద్వారా వెయ్యి యూనిట్ల రక్తం
సేకరించారు. తానే స్వయంగా మూడుసార్లు రక్తదానం చేసారు. వరద బాధితులకు సహాయ
కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ప్రతీయేటా
ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, యూనిట్లు, యూనివర్సిటీలకు ఈ
పురస్కారాలు ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం మొత్తం 41 మంది విద్యార్థులు ఈ పురస్కారాలు
గెలుచుకున్నారు.