కొత్త పార్లమెంటులో మొట్టమొదట ప్రవేశపెట్టిన, పాస్ చేసిన మహిళా
రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో ఈ బిల్లు
చట్ట రూపం సంతరించుకుంది.
కొత్త మహిళా రిజర్వేషన్ చట్టం… లోక్‌సభలోనూ, రాష్ట్రాల
శాసనసభల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది.
ముందుగా… రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్,
బిల్లుపై సంతకం చేసారు. తర్వాత దాన్ని రాష్ట్రపతి వద్దకు ఆమోదం కోసం పంపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో దాదాపు ఏకగ్రీవంగానూ, రాజ్యసభలో
ఏకగ్రీవంగానూ పాస్ అయింది. ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రం లోక్‌సభలో ఈ
బిల్లును వ్యతిరేకించారు, మహిళల పట్ల తమ వైఖరిని బైటపెట్టుకున్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి రావడానికి మాత్రం సమయం
పడుతుంది. తదుపరి జనగణన పూర్తవాలి, నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి. ఆ
తర్వాత జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.
రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం లేని ప్రజాస్వామ్యం అర్ధరహితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రజాస్వామ్య విజయం మాత్రమే కాదు, తమ పార్టీ వైఖరి కూడా అని మోదీ వెల్లడించారు.