మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలికపై జరిగిన
అత్యాచారం, ఆమెకు సాయం చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాకపోవడం దేశవ్యాప్తంగా
చర్చనీయాంశమైంది. ఒక ఆశ్రమ పూజారి ఆమెను కాపాడి, ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు
ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.
బాధిత బాలిక నిస్సహాయంగా దుస్తులు లేకుండా
రక్తమోడుతూ 8 కిలోమీటర్ల పాటు వీధుల్లో తిరిగిన ఘటన విస్తృతంగా చర్చకు
దారితీసింది. ఆ సమయంలో కొందరు తీసిన వీడియో వైరల్ అవడంతో పాటు, ఆమెను
గుర్తించడానికి కారణమైంది. బాధిత బాలిక తన వివరాలేవీ చెప్పలేకపోవడంతో ఆమెను
గుర్తించడం కష్టమయింది. అయితే బాధితురాలి వీడియోను ఆమె బంధువు ఒకరు చూసి, ఆమె
తండ్రికి వెల్లడించారు. అలా ఆయన తన కూతురిని చేరుకోగలిగారు.
బాధితురాలిది మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా.
సెప్టెంబర్ 24న రోజూలాగే బడికి నడుచుకుంటూ వెళ్ళిందని, కానీ సాయంత్రం తిరిగి
రాలేదనీ ఆమె తండ్రి చెప్పారు. ఆ రోజంతా వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదన్నారు.
దాంతో సెప్టెంబర్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు. ఉజ్జయినిలో దారుణ సంఘటన
వీడియోను ఒక బంధువు చూపించడంతో, ఆ బాధితురాలు తన కుమార్తేనని గుర్తించినట్టు
చెప్పారు.
ఉజ్జయినిలో బాలిక ఒక ఆటో ఎక్కినట్టు సీసీటీవీలో
నమోదయింది. ఆ ఆటోలో రక్తపు మరకలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్
పరీక్ష చేయిస్తున్నట్టు చెప్పారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు.
ఒకవైపు స్థానిక ప్రజలు బాధితురాలికి సహాయం
చేయకపోవడం విమర్శలకు దారితీస్తే, అదే సమయంలో పోలీసుల మానవత్వం ప్రశంసల పాలయింది.
బాలికకు ఇద్దరు పోలీసులు రక్తదానం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉజ్జయిని మహాకాళ్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్
అజయ్ వర్మ, బాధిత బాలికను దత్తత తీసుకోడానికి సిద్ధమయ్యారు. ఆమె తల్లిదండ్రుల
ఆచూకీ తెలియకపోతే, ఆమెను చట్టబద్ధంగా దత్తత తీసుకోడానికి సిద్ధమైనట్టు ఆయన
చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స సమయంలో ఆ చిన్నారి ఆవేదన తనను కలచివేసిందన్నారు.
బాలిక ఆస్పత్రి ఖర్చులు తానే పెట్టుకుంటానన్నారు. అలాగే ఆమెను తానే చదివిస్తానని
చెప్పారు.
ఈ కేసులో నేరస్తులను
మామూలుగా వదిలిపెట్టబోమనీ, కఠినంగా శిక్షిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్
సింగ్ చౌహాన్ చెప్పారు.