భారత్‌తో దౌత్య సమరంలో అమెరికా తమకే
మద్దతిస్తోందని కెనడా చెప్పుకుంటున్నా, ఆ విషయంపై అమెరికా బహిరంగంగా స్పందించడం
లేదు.
తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ
మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలపై
చర్చించారు. బ్లింకెన్‌తో ఆ సమావేశం గురించి జయశంకర్ ట్వీట్ చేశారు. ‘‘విస్తృత
స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. త్వరలో జరగబోయే
2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించాం’’ అని ఎక్స్ (ట్విటర్)లో
పేర్కొన్నారు. అమెరికా విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఆ సమావేశం గురించి అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి
మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ‘‘జీ20కి భారత్ నేతృత్వంలో లభించిన ఫలితాలు, భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా
కారిడార్, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై పెట్టుబడులు వంటి
అంశాల గురించి చర్చ జరిగింది. భవిష్యత్తులో జరగబోయే 2+2 భేటీ
కోసం ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ, అంతరిక్షం,
పరిశుద్ధ ఇంధన రంగాల్లో సమన్వయం కొనసాగడం అవసరమని బలంగా
విశ్వసిస్తున్నారు’’ అని వెల్లడించారు. ఇరు దేశాల మంత్రుల భేటీ అనంతరం ఈ ప్రకటన
వెలువడింది. 2+2 భేటీ తేదీలను మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా
ఏటా ఈ సమావేశం నవంబర్ తొలి అర్ధ భాగంలో జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఇరు దేశాల
విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు పాల్గొంటారు.
భారత్-అమెరికా విదేశాంగ మంత్రులు కెనడాలో హర్దీప్
సింగ్ నిజ్జర్ హత్య అంశం గురించి నోరెత్తలేదు. ఆ విషయం చర్చకు వచ్చిందా లేదా అనే
విషయం కూడా వెల్లడించలేదు. దాని గురించిన ప్రశ్నలకు బ్లింకెన్ జవాబయినా ఇవ్వలేదు.
‘‘మిత్రుడు, సహచరుడు జయశంకర్‌ను విదేశాంగశాఖ ప్రధాన
కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. జీ20, ఐక్యరాజ్యసమితి
సర్వప్రతినిథి సభ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయి’’ అని వెల్లడించారు. స్టేట్
డిపార్ట్‌మెంట్ ట్రీటీ రూమ్‌లో జరిగిన ఫొటో సెషన్‌లో ఇరు దేశాల మంత్రులు చాలా
ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన
జయశంకర్, జీ20 సదస్సుకు సహకరించిన
అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా కానీ భారత్ కానీ నిజ్జర్ గురించి నోరెత్తకపోవడం
గమనార్హం.