పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు సమీపంలో ఇవాళ జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది చనిపోయారు. 130 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల ర్యాలీకి ప్రజలు సిద్దమవుతున్న సమయంలో ఓ దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్టు జియో న్యూస్ వెల్లడించింది.
ఈ పేలుడులో ర్యాలీ విధులు నిర్వహిస్తోన్న డీఎస్పీ నవాజ్ గష్కోరి కూడా చనిపోయారు. మహమ్మద్ ప్రవక్త జయంతి ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకుని ప్రజలు ర్యాలీకి సిద్దమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. డీఎస్పీ కారు పక్కనే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి దిగినట్టు సిటీ స్టేషన్ హౌస్ అధికారి మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు కుట్ర కారణాలు తెలియరావాల్సి ఉంది.