విపక్ష
నేతలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుత సంక్షేమ
ప్రభుత్వానికి గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. అమరావతి
పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో తాము పోరాటం చేస్తున్నామన్నారు.
గతంలోనూ ఇదే
బడ్జెట్ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయిందని
ప్రశ్నించారు. దోచుకోవడానికే వాళ్ళకు అధికారం కావాలని, దోచుకున్నది పంచుకునేందుకు
అధికారం కావాలని విపక్షనేతలను దుయ్యబట్టిన సీఎం జగన్.. తనకు గజదొంగల ముఠా అండగా
లేదన్నారు.
వంతపాడేందుకు దత్తపుత్రుడూ లేరన్నారు. పేదవాడి ప్రభుత్వం రావాలని, పెత్తందారుల
ప్రభుత్వం రాకూడదని అన్నారు. ఓటు వేసే ముందు, జరిగిన మంచి గురించి ఆలోచించాలని
కోరారు. మీ ఇంట్లో మంచి జరిగిందనిప్తే తనకు తోడుగా ఉండాలని ప్రజలను సీఎం కోరారు.
త్వరలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఒక వైపు పేదల ప్రభుత్వం ఉంటే మరో వైపు
పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు.
విజయవాడ
విద్యాధరపురంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు ఐదో విడత
నగదు సాయం విడుదల చేశారు. 2023-24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు
ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. ఈ పథకం
కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,301.89 కోట్లు ఖర్చు చేసింది.
సొంత
వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ
ఆపరేటర్లకు ఈ నగదు సాయం అందుతుంది.