ఢిల్లీలోని ఉమ్రావ్ జ్యుయలరీ దుకాణంలో రూ.25 కోట్ల విలువైన బంగారు నగలు కాజేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ చోరీతో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానితులను ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సొత్తును స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యకాలంలో ఢిల్లీలోని భోగాల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యుయలరీ దుకాణంలో భారీ చోరీ జరిగినట్టు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.
నాలుగంతస్తుల ఉమ్రావ్ జ్యుయలరీ భవనం టెర్రాస్ ఎక్కి అక్కడి నుంచి కింది అంతస్తులకు దొంగలు చేరుకున్నట్టు సీసీ టీవీ వీడియోల్లో గుర్తించారు. జ్యుయలరీ దుకాణంలోని లాకర్ గదికి డ్రిల్లింగ్ మిషన్‌తో కన్నం వేసి దొంగతనం చేసినట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. లాకర్‌లో దాచిన బంగారు నగలతోపాటు, ప్రదర్శనగా ఉంచిన నగలు కూడా దొంగలు దోచుకెళ్లారు. మొత్తం రూ.25 కోట్ల విలువైన బంగారం చోరీ అయినట్టు దుకాణ యజమాని ప్రకటించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.