తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం ముదురుతోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రైతు సంఘాలు రాష్ట్ర బంద్ చేపట్టాయి. విద్యా సంస్థలు, వ్యాపారాలు, హోటళ్లు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్యాక్సీ సేవలు కూడా నిలిచిపోయాయి. రైతు సంఘాల బంద్ పిలుపుతో కర్ణాటక స్తంభించిపోయింది.
కర్ణాటక బంద్ ప్రభావం విమాన రాకపోకలపై ప్రభావం చూపింది. బెంగళూరు నుంచి బయలు దేరాల్సిన 44 విమానాలను రద్దు చేశారు. బంద్ ప్రభావంతో వేలాది మంది టికెట్లు రద్దు చేసుకోవడంతో విమాన సర్వీసులు నిలిపేశారు.
రైతు సంఘాలు బంద్కు పిలుపు నివ్వడం, వారికి ఇతర సంఘాలు కూడా మద్దతు పలకడంతో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది. ఉదయం ఆరు గంటలకే బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.బస్టాండ్ల వద్ద నిరసనకారులు బస్సులను అడ్డుకోవడంతో నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిరసనకారులు బలవంతంగా పెట్రోల్ బంకులను కూడా మూసి వేయించారు. వందలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.