స్వచ్ఛభారత్
కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గాంధీ జయంతికి ముందు రోజైన అక్టోబర్1న దేశవ్యాప్తంగా పరిసరాల
పరిశుభ్రత చేపట్టాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉమ్మడి బాధ్యత అని,
దాని కోసం చేసే ప్రతీ ప్రయత్నం విలువైనది అని మోదీ వివరించారు.
అక్టోబర్
1న ఉదయం పదిగంటలకు కీలకమైన పరిశుభ్రత కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు సోషల్
మీడియా వేదికగా పంచుకున్న ప్రధాని, పరిశుభ్రమైన భవిష్యత్ తరాల నిర్మాణానికి
చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని తన సందేశంలో
పేర్కొన్నారు.
మన్ కీ బాత్ 105
ఎపిసోడ్లో కూడా స్వచ్ఛతా వారోత్సవం
గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని
తాము ఉంటున్న ప్రాంతంలో శ్రమదానం చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. వీధులు, పార్కులు,
నదులు, కాలువల వద్ద ఉమ్మడిగా శ్రమదానం చేయాలని కోరారు.
గాంధీ జయంతి
సందర్భంగా అంతకు ముందు రోజైన ఒకటో తారీఖు, ఒక గంటపాటు ఒకటిగా స్వచ్ఛత
కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గ్రామాలు,
పట్టణాలు, ప్రభుత్వ సంస్థల్లో కూడా స్థానిక పౌరుల సాయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని
సూచించారు. ఈ కార్యక్రమం కోసం కేంద్రప్రభుత్వం ఓ పోర్టల్ ను అందుబాటులోకి
తెచ్చింది. స్వచ్ఛతా కార్యక్రమంలో
పాల్గొన్న తమ ఫోటోను ఈ పోర్టల్ లో అప్లోడ్ చేయవచ్చు.
స్వచ్చ
భారత్ మిషన్ 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ ప్రారంభించారు. బహిరంగ మలవిసర్జన రహిత
దేశంగా భారత్ ను మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.
2021లో
ప్రధాని మోదీ, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం
ద్వారా నగరాలను చెత్త రహితంగా మార్చడంతో పాటు, నీటి భద్రత చర్యలు చేపట్టారు.
మహాత్మాగాంధీ
కలలుగన్న స్వచ్ఛ భారత్ ను నెరవేర్చే దిశగా ఈ కార్యక్రమం ఓ ముందడుగు అని ప్రధాని
మోది ఉద్బోధించారు.