నాలుగు వారాల కనిష్ఠాలను నమోదు చేసి, వరుస భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. గురువారం ముగింపు కన్నా ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీలు 0.2 శాతం లాభాలతో ప్రారంభం అయ్యాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
డాలరు బలపడటం, అమెరికా బాండ్లు సత్ఫలితాలివ్వడం, ముడి చమురు ధరలు దిగిరావడంలాంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం కూడా దేశీయ మార్కెట్లలో నమ్మకాన్ని పెంచాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త బీకే విజయ్‌కుమార్ వెల్లడించారు.
ఫెడ్ వడ్డీ రేట్లలో మార్పులు, చమురు ధరలు నిలకడగా లేకపోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. అక్టోబరు 6న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ ఫాలసీ ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ గత మూడు సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. వచ్చే వారంలో సమావేశమయ్యే రిజర్వ్ బ్యాంకు అధికారులు రెపోరేట్ స్థిరంగా కొనసాగిస్తారని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు.