ఆ ఉగ్రవాదిని అంకుల్ అని పిలుస్తారు. అతని అసలు
పేరు జావేద్ పటేల్. అతని లక్ష్యం భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం. దానికి అతను
ఎంచుకున్న పద్ధతి దొంగనోట్ల చెలామణీ. అత్యుత్తమ నాణ్యత కలిగిన నకిలీ కరెన్సీ
నోట్లను తన సహచరుల ద్వారా దేశంలో చెలామణీ చేసేవాడు.
ఈ వివరాలన్నీ చెప్పింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.
థానే నకిలీ కరెన్సీ కేసులో ఆ సంస్థ తాజాగా బుధవారం నాడు ముంబై ప్రత్యేక
న్యాయస్థానంలో జావేద్ పటేల్ సహా నలుగురి మీద అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ
చార్జిషీట్‌లో ఈ వివరాలన్నీ వెల్లడించింది.
జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా అలియాస్
అంకుల్, రియాజ్ షికిల్కర్, మహ్మద్ ఫయాజ్ షికిల్సకర్, నాసిర్ చౌధురి అనే నలుగురి
మీద భారత శిక్షా స్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) సెక్షన్ల
ప్రకారం ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఫయాజ్ మీద ఆయుధాల చట్టం ప్రొవిజన్ల ప్రకారం
కూడా కేసు నమోదయింది.
గత ఏప్రిల్ నెలలో రెండువేల రూపాయల భారత కరెన్సీకి
చెందిన 149 నకిలీనోట్లను రియాజ్ షికిల్కర్ దగ్గరనుంచి థానే పోలీసులు సీజ్ చేసారు.
ఆ కేసులో ముగ్గురు నిందితుల మీద చార్జిషీటు దాఖలు చేసారు. తర్వాత ఆ కేసు ఎన్ఐఏ
చేతికి వచ్చింది, దర్యాప్తు చేస్తున్న క్రమంలో మే 2023లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న
నేరానికి ఫయాజ్‌ను అరెస్ట్ చేసారు,
‘‘ఈ కేసు దర్యాప్తులో ఫయాజ్ భారతదేశంలో
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నాడని, అందులో భాగంగా అంకుల్ అలియాస్ జావేద్
పటేల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడనీ తెలిసింది. ఉగ్రవాది అయిన జావేద్ పటేల్, తన
అనుచరుడైన ‘భాయ్’ అనేవాడి ద్వారా ఫయాజ్‌కు నిధులు సమకూర్చాడనీ తేలింది.’’ అని
ఎన్ఐఏ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
జావేద్ పటేల్ భారత ఆర్థిక స్థిరత్వాన్ని
దెబ్బతీయడమే లక్ష్యంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన నకిలీ భారతీయ కరెన్సీని తన అనుచరుల
ద్వారా దేశంలో చెలామణీలోకి తెస్తున్నాడనీ, తద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు
పాల్పడుతున్నాడనీ ఎన్ఐఏ తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది.