టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపటి నుంచి చేపట్టాల్సిన యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఉండటంలో యువగళం పాదయాత్ర వాయిదా వేసుకోవాలంటూ టీడీపీ నేతలు కోరడంతో అందుకు లోకేశ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. స్కిల్ కేసులో ఢిల్లీలో లాయర్లతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉండటంతో లోకేశ్ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు.
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుతో లోకేశ్ పాదయాత్ర వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాజోలు సమీపంలో కొమరాడ వద్ద లోకేశ్ పాదయాత్ర నిలిచిపోయింది. రేపటి నుంచి మరలా పాదయాత్ర చేస్తున్నట్టు మూడు రోజుల కిందట లోకేశ్ ప్రకటించారు. బుధవారంనాడు చంద్రబాబు కేసు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు నోచుకోకపోవడంతో పాదయాత్ర వాయిదా వేయాలని నిర్ణయించారు. అక్టోబరు 3న సుప్రీంకోర్టులో కేసు విచారణ తరవాత వచ్చే తీర్పును పరిశీలించిన తరవాత యువగళం పాదయాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.