డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన
ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల బృందం
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితో సమావేశమయ్యారు.
బుధవారం జరిగిన భేటీలో విశ్వహిందూపరిషత్ బృందం
గవర్నర్‌కు మెమొరాండం సమర్పించారు. సనాతన ధర్మంపై రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు
ఆందోళనకరంగా ఉన్నాయంటూ ఆ మెమొరాండంలో పేర్కొన్నారు.
‘‘తమిళనాడులో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం
చేసిన వ్యక్తులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం ఆందోళనకరంగా
ఉందంటూ, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల బృందం గవర్నర్ రవికి ఒక మెమొరాండం
సమర్పించారు’’ అంటూ తమిళనాడు రాజ్‌భవన్ ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
గవర్నర్ రవి బుధవారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పదనం గురించి ప్రసంగించారు. ఈసారి జి-20 సదస్సుకు ‘వసుధైవ
కుటుంబకం’ అన్న ఇతివృత్తాన్ని ఎంచుకోవడం ద్వారా భారతదేశం గతంలో ఎన్నడూ లేనంత
విస్తృతంగా సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
‘‘ఈ నెల
9,10 తేదీలలో జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం వహించింది. మన దేశంతో పాటు ప్రపంచమంతా
దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘సనాతన ఉత్సవం’ జరుపుకుంది. భారత్ నేతృత్వంలో జరిగిన జి-20
సదస్సు సనాతన విలువలకు, సనాతన ధర్మానికి నిబద్ధులమై ఉంటామని సూత్రీకరించింది. వసుధైవ
కుటుంబకం అన్న భావనను విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా సనాతన ధర్మాన్ని ఉత్సవంలా
జరుపుకోవడం మొదలుపెట్టింది’’ అని, గవర్నర్ రవి అన్నారు.