ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆహారవృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అనేక నూతన వంగడాలను తయారు చేశారు. వ్యవసాయరంగంలో ఆయన చేసిన సేవలకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
స్వామినాథన్ 1925 ఆగస్టు7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు.ఆయన తండ్రి సాంబశివన్ ప్రముఖ డాక్టర్. తండ్రి బాటలోనే స్వామినాథన్ పయనించారు. 1943లో బెంగాల్లో క్షామం వచ్చి లక్షలాది మంది ఆకలితో చనిపోయిన ఘటనలు స్వామినాథన్‌ను కదిలించి వేశాయి. దీంతో ఆయన మెడిసిన్ చదువు వదిలేసి, వ్యవసాయ పరిశోధనలవైపు దృష్టి సారించారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మద్రాసు అగ్రికల్చరల్ కళాశాలలో చేరారు. అక్కడ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. తరవాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ పూర్తి చేశారు.
చదువు పూర్తి కాగానే స్వామినాథన్ ఐసీఎస్‌కు అర్హత సాధించారు. ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ అనేక పరిశోధనలు చేశారు. అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో పీహెచ్డీ చేశారు. కొంత కాలం అక్కడే పనిచేశారు. 1954లో భారత్‌కు తిరిగి వచ్చి, ఐసీఆర్ఐలో శాస్త్రవేత్తగా పరిశోధనలు కొనసాగించారు.
1972 నుంచి ఐదేళ్లపాటు భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలోనూ కీలక పాత్ర పోషించారు. 1979లో స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార కొరత లేకుండా చేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు.