ఇస్కాన్ సంస్థ గోవులను కబేళాలకు అమ్ముతోందంటూ కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ నేత మేనకాగాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇస్కాన్ తీవ్రంగా స్పందించింది.గోశాలలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి వందల ఎకరాలు తీసుకుని, అనేక ప్రయోజనాలు పొంది, గోవులను కబేళాలకు విక్రయిస్తున్నారంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి. ఇలాంటి పని ఎవరూ చేయరంటూ మేనకా పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనేది తెలియరాలేదు. దీనిపై మేనకా గాంధీ స్పందించలేదు.
ఇటీవల మేనకాగాంధీ అనంతపురంలోని ఇస్కాన్ నిర్వహిస్తోన్న గోశాలను సందర్శించారు. అక్కడ ఒక్క ఆవు కూడా సరైన స్థితిలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఒక్క ఆవు కూడా ఈనిన దాఖలాలు లేవని, వట్టిపోయిన ఆవు ఒక్కటి కూడా లేదని వీడియోలో తెలిపారు. ఇక్కడి పరిస్థితులు గమనిస్తే గోవులను అమ్ముతున్నారని అర్థం అవుతోందని ఆమె ఆరోపించారు.
మేనకాగాంధీ ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. గాయపడిన ఆవులు, ఎడ్లను గోశాలల్లో కంటికి రెప్పలా కాపాడుతున్నామని ప్రకటించారు.దేశంలో 60 గోశాలలు నడుపుతున్నామని, ఎవరైనా గోశాలలను సందర్శించవచ్చన్నారు. కబేళాలకు తరలిస్తున్న ఆవులను కూడా తీసుకువచ్చి రక్షిస్తున్నట్టు ఇస్కాన్ స్పష్టం చేసింది.