భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్
ఇవాళ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమవుతారు. మంగళవారం నాడు న్యూయార్క్
నగరంలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో పాల్గొన్న జయశంకర్, అక్కడినుంచి
బుధవారం రాత్రికి వాషింగ్టన్ చేరుకున్నారు.
జయశంకర్ వాషింగ్టన్‌లో బ్లింకెన్‌తో పాటు
అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ టాయ్‌తో కూడా సమావేశమవుతారు. ఇంకా… యుఎస్ ప్రభుత్వ
అధికారులు, వాణిజ్యవేత్తలు, మేధో బృందాలతో చర్చలు జరుపుతారు.
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో జయశంకర్ కెనడా
పేరెత్తకుండా, ఉగ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిని పరోక్షంగా
దుయ్యబట్టారు. ఉగ్రవాదం, తీవ్రవాదం పట్ల స్పందనలో రాజకీయ అవకాశవాదానికి జోక్యం
చేసుకునే వెసులుబాటు కలిగించకూడదని స్పష్టం చేసారు. ఒక దేశపు ప్రాదేశిక సమగ్రత,
అంతర్గత వ్యవహారాల గురించి స్పందించేటప్పుడు ఆ స్పందన అన్నిదేశాల విషయంలోనూ ఒకేలా
ఉండాలి తప్ప దేశాన్ని బట్టి మారిపోకూడదని కుండబద్దలు కొట్టారు. ఐక్యరాజ్య సమితి కూడా
తాను విధించిన నియమాలను అన్ని దేశాలకూ ఒకేలా వర్తింపజేయాలని సూచించారు. ఐతోరాస
ఎజెండాను రూపొందించి విధి విధానాలను నిర్వచించే పనిని కొన్ని దేశాలు తమ గుత్త
అధికారంగా భావిస్తున్నాయనీ, అలాంటి వైఖరి ఇకపై చెల్లబోదనీ స్పష్టం చేసారు. ఆయా
దేశాల పనితీరును ఎవరూ సవాల్ చేయని పరిస్థితులు లేవని వివరించారు. నియమాలు అందరికీ
ఒకేలా వర్తింపజేస్తేనే వాటికి విలువ, ఆమోదం ఉంటాయని జయశంకర్ వ్యాఖ్యానించారు.
ఆంటోనీ బ్లింకెన్‌తో జయశంకర్ సమావేశం
అజెండా ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే భారత్-కెనడా దౌత్య ప్రతిష్టంభన అంశం
చర్చల్లో లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేసారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని భారత్‌కు
ఇప్పటికే సూచించామని ఆయన వెల్లడించారు. ఇరుదేశాలూ పరస్పరం సహకరించుకోవడాన్నే తాము
ప్రోత్సహిస్తామని మాథ్యూ అన్నారు.
భారత్ ఇప్పటికే నిజ్జర్ హత్య విషయంలో
కెనడా చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ కొట్టిపడేసింది. కెనడా నిర్దుష్టమైన
ఆధారాలు ఏవైనా చూపితే వాటిపై భారతదేశం దర్యాప్తు జరిపిస్తుందని హామీ ఇచ్చింది. ఎవరినైనా
సరే, హత్యలు చేయించడం భారత ప్రభుత్వం విధానం కాదని జయశంకర్ స్పష్టంగా
వెల్లడించారు.