మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్ధుల హత్యకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేసారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మళ్ళీ కర్ఫ్యూ విధించారు.
17ఏళ్ళ వయసున్న విద్యార్ధి, విద్యార్ధిని జులై నెల నుంచి కనబడకుండా పోయారు. తాజాగా సోమవారం నాడు వారి ఫొటోలు బైటపడ్డాయి. మొదటి ఫొటోలో వారిద్దరూ కొందరు సాయుధుల మధ్యలో ఒక అటవీ ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. రెండో ఫొటోలో వారిద్దరి శవాలూ నేలమీద పడి ఉన్నాయి. ఈ ఫొటోలు బైటకు రావడంతో మళ్ళీ మణిపూర్ భగ్గుమంది.
మంగళవారం రాత్రి నుంచీ ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విద్యార్ధులు పెద్దసంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిని ముట్టడించడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు నిలువరించారు. ఈ ఉదయం మళ్ళీ ఆందోళనలు కొనసాగాయి. సీఎం నివాసానికి చేరువలోని కాంగ్లా ఫోర్ట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో పోలీసులు లాఠీచార్జికి పాల్పడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు విద్యార్ధులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరు విద్యార్థుల హత్య సంఘటనపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ నేతృత్వంలో ఒక బృందం ఈ ఉదయం ఇంఫాల్ చేరుకుంది. అయితే, ఈ ఘటనపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించి వెంటనే సీబీఐ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించడంతో మరోవర్గం ఆగ్రహించింది. బీరేన్ సింగ్ సర్కారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆ వర్గం కూడా ఆందోళన నిర్వహించింది.
ఇంఫాల్‌లో మళ్ళీ కర్ఫ్యూ విధించారు. అంతకు ఒక్కరోజు ముందే, మొబైల్ ఇంటర్నెట్ మీద మళ్ళీ నిషేధం విధించారు. నిజానికి ఐదు నెలల పాటు మొబైల్ ఇంటర్నెట్పై విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 23నే తొలగించారు. ఇద్దరు విద్యార్ధుల హత్య ఘటన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 26న నిషేధం విధించారు.
మరోవైపు… సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్‌లో మరో ఆరునెలల పాటు పొడిగించారు. ఇంఫాల్ లోయలోని 19 పోలీస్ స్టేషన్ల పరిధి, అలాగే అసోం సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రాంతం మినహాయించి మిగతా రాష్ట్రం అంతటా ఈ చట్టం అమల్లో ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.