స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎస్ భట్టి విముఖత చూపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయనున్నారు. అయితే కేసు ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే తెలుస్తోంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ నిబంధనలు ఉల్లంఘించి, గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై కేసు నమోదు చేయడంపై ఆయన తరపు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌ను గత వారం ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు. చంద్రబాబు కేసును తాను విచారించలేనని, వేరే బెంచ్ ముందుకు తీసుకెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎస్ భట్టి ప్రకటించడంతో, ఈ కేసు వచ్చే వారానికి వాయిదా పడింది.