కుక్క మనిషిని కరిస్తే వింతా కాదు, వార్తా కాదు. కానీ అది అగ్రరాజ్యం అధినేత పెంపుడు కుక్క అయితే… అది కరిచింది జేమ్స్‌బాండ్ లాంటి గూఢచారినైతే…. ఆ కుక్క అలా కరవడం ఇది పదకొండోసారి అయితే…. అది కచ్చితంగా వింతే, వార్తే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ కుక్కని పెంచుకుంటున్నారు. జర్మన్ షెపర్డ్ బ్రీడ్‌కి చెందిన ఆ రెండేళ్ళ కుక్క పేరు కమాండర్. మొన్న సోమవారం ఆ కమాండర్ ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ని కరిచింది.
కమాండర్ కుక్క, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో గార్డుని కరవడం ఇదేమీ మొదటిసారి కాదు. బైడెన్ పెంపుడు కుక్క ఇప్పటివరకూ పదిమంది పిక్కలు పట్టుకుంది. ఇప్పుడు కరిపించుకున్న గార్డు పదకొండోవాడు.
‘‘సోమవారం రాత్రి సుమారు 8 గంటలకు సీక్రెట్ సర్వీస్‌కి చెందిన పోలీస్ అధికారి ఒకరు అధ్యక్ష కుటుంబం పెంపుడు కుక్క చేరువలోకి వచ్చాడు. అప్పుడా కుక్క అతన్ని కరిచింది. వైట్‌హౌస్ కాంప్లెక్స్‌లోని వైద్యాధికారులు అతనికి చికిత్స చేసారు’’ అని యుఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంటోనీ గుగ్లియెల్మి చెప్పారు. గాయపడిన అధికారి తన పై అధికారి ఆల్ఫోన్సో ఎం డైసన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నట్టు వెల్లడించారు.
చిత్రమేంటంటే, బైడెన్ కుక్క కమాండర్ ఇప్పటివరకూ సుమారు 11 మందిని కరిచింది. నవంబర్ 2022లో ఇలాగే ఒక అధికారిని కరిచినప్పుడు అతనికి చేతుల మీద, తొడల మీద తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
తమ పెంపుడు కుక్క ఇలా అందరినీ కరుస్తుండడంతో బైడెన్ దంపతులు ఈ యేడాది జులైలో దానికి శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నాలు చేసారు. వైట్‌హౌస్‌లో ఎప్పటికప్పుడు మారుతూండే ప్రత్యేక పరిస్థితులను కమాండర్ అవగాహన చేసుకోలేకపోతోంది. దానికి అలాంటి అవగాహన కల్పించేందుకు శిక్షకులతో ప్రయత్నాలు చేసారని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ చెప్పారు. బహుశా ఆ శిక్షణ ఫలించలేనట్టుంది.
బైడెన్ గతంలో ‘మేజర్’ అనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కని పెంచుకునేవారు. అది కూడా ఇలాగే అందరినీ కరుస్తుండేది. దాంతో ఆ కుక్కని వదిలిపెట్టేసారు. 2021లో కమాండర్ వైట్‌హౌస్‌లోకి వచ్చింది. మరిప్పుడు బైడెన్ దంపతులు ఈ కమాండర్‌ని ఉంచుకుంటారో లేక వదిలిపెట్టేస్తారో చూడాలి.