ఖలిస్తానీ ఉగ్రవాది హత్య వెనుక భారత
ఏజెంట్ల హస్తముందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా స్పందించారు. అది భారత ప్రభుత్వ విధానం
కాదని స్పష్టం చేసారు. ఆ హత్య విషయంలో నిర్దుష్టమైన, సంబద్ధమైన సమాచారం ఇవ్వాలని
కెనడాకు ఇప్పటికే స్పష్టం చేసినట్టు వెల్లడించారు.
అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి
సర్వప్రతినిధి సభలో జయశంకర్ ప్రసంగించారు. ఆ తర్వాత భారత్‌కు అమెరికా రాయబారిగా
గతంలో పనిచేసిన కెన్నెత్ జస్టర్ కెనడా విషయమై ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా జయశంకర్
ఈ వ్యాఖ్యలు చేసారు.
‘‘అలా ప్రవర్తించడం భారతదేశ ప్రభుత్వపు
విధానం కాదని కెనడాకు మేం చెప్పాం. చూడండి, మీ దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సమాచారముంటే,
అది సమంజసంగా, సంబద్ధంగా ఉంటే మాకు చెప్పండి. మేం దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా
ఉన్నాం’’ అన్నారు జయశంకర్.
‘‘గత కొన్నేళ్ళుగా కెనడాలో వేర్పాటువాద
శక్తుల వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోయాయి. హింసాకాండ, తీవ్రవాదం, వ్యవస్థీకృత
నేరాలూ అన్నీ కలగలిసిపోయాయి’’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు.
కెనడా కేంద్రంగా జరుగుతున్న ఆర్గనైజ్డ్
క్రైమ్ గురించి భారతదేశం ఎప్పటికప్పుడు ఆ దేశానికి సమాచారం అందిస్తూ వస్తోందని
జయశంకర్ చెప్పారు. కెనడా నుంచి పనిచేస్తున్న పలువురు ఉగ్రవాద నాయకులను భారత్ గుర్తించిందనీ,
వారిని అప్పగించాలని పలుమార్లు అభ్యర్ధించిందనీ వెల్లడించారు. కెనడాలో
పనిచేస్తున్న భారత దౌత్యాధికారులు తరచుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని జయశంకర్
ఆందోళన వ్యక్తం చేసారు.
‘‘పరిస్థితి ఎలా ఉందంటే, మా దౌత్యాధికారులు బెదిరింపులు ఎదుర్కొంటున్నారు,
మా దౌత్య కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ‘తమ రాజకీయాల్లో జోక్యం
చేసుకుంటున్నారం’టూ మా అధికారులపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి చర్యలన్నింటినీ
ప్రజాస్వామ్యం పేరిట కెనడా సమర్ధించుకుంటూ వస్తోంది’’ అని జయశంకర్ స్పష్టం చేసారు.
జి-20 సదస్సులో పాల్గొనడానికి భారత్
వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, కెనడాలో వేర్పాటువాద కార్యకలాపాల గురించి
ప్రస్తావించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. అప్పటినుంచీ ఇరుదేశాల
మధ్యా సౌహార్ద సంబంధాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత కెనడా పార్లమెంటులో మాట్లాడుతూ,
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చెప్పడం,
ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. నిజ్జర్‌ను భారతదేశం ఉగ్రవాదిగా ఎప్పుడో
ప్రకటించింది. నిజ్జర్ హత్య విషయంలో ట్రూడో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమంటూ భారత్ ఖండించింది.