అసెంబ్లీ
సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. నేటితో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
ముగియనుండటంతో పలు బిల్లులను ప్రభుత్వం
ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అలాగే పలు విషయాలపై చర్చ నిర్వహించగా మంత్రులు
వివరణ ఇచ్చారు.
కాంట్రాక్ట్
ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,
2014 నుంచి ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. ఆర్టీసీ
ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని గుర్తు చేసిన బుగ్గన, దాంతో 53 వేల మంది ఉద్యోగులకు మేలు
జరిగిందన్నారు.
అనంతరం
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు.
జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ.2,500 కోట్ల భారం పడిందన్నారు. ఆశా వర్కర్ల జీతం
పదివేలకు పెంచడంతో పాటు పోలీసులకు వీక్లీఆఫ్ ఇచ్చామన్నారు. హామీ ఇచ్చిన ప్రతీ విభాగానికి
తమ ప్రభుత్వం మేలు చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా విధానాలను దేశం మొత్తం ప్రశంసిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో పేదవాడికి నాణ్యమైన విద్య అందుతోందన్న మంత్రి,
ట్యాబ్‌ల పంపిణీతో డిజిటల్ విద్యను చేరువ చేశామన్నారు. పేదలకు విద్య భారం కాకుండా ప్రభుత్వం
చర్యలు చేపట్టిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటాలని
బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు.
మరో
మంత్రి మేరుగ నాగార్జున విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరంగా
జరుగుతున్నాయని చెప్పారు. అన్ని పనులూ తుది దశకు చేరుకున్నాయని, రాజ్యాంగ నిర్మాతకు
ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా దీనిని భావిస్తున్నామని చెప్పారు. టూరిజం స్పాట్ గా
తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.