మధ్యప్రదేశ్‌లో మహాఘోరం జరిగింది.
పన్నెండేళ్ళ చిన్నారి బాలిక అత్యాచారానికి గురయింది. రక్తమోడుతున్న ఒంటి మీద సరైన దుస్తులే
లేని దుస్థితిలో సహాయం కోసం ఇంటింటికీ తిరిగి ప్రతీ తలుపూ తట్టింది. ఎవ్వరూ ఆమెకు
అండగా నిలవలేదు. ఒక వ్యక్తి ఆమెను తరిమేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి కూడా.
ఈ దుర్ఘటన ఉజ్జయిని నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో బాడ్‌నగర్ రోడ్డు మీద
చోటు చేసుకుంది.
అత్యాచార ఘటనతో భయభ్రాంతురాలైపోయిన
చిన్నారి బాలిక ఒంటిమీద సరైన దుస్తులయినా లేని నిస్సహాయ పరిస్థితిలో వీధులన్నీ
తిరిగి తిరిగి చివరికి ఒక ఆశ్రమం చేరింది. అక్కడ ఒక సాధువు ఆ బాలికను చూసి
చలించిపోయారు. లైంగిక అత్యాచారానికి గురయిందని అర్ధం చేసుకున్నారు. వెంటనే ఆమెను
ఒక శాలువాతో కప్పి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ బాలికను
పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.
బాలికకు అయిన గాయాలు తీవ్రమైనవి కావడంతో
ఆమెను హుటాహుటిన ఇండోర్‌కు తరలించారు. ఆమెకు రక్తం అవసరమైతే స్థానిక పోలీసులు
సహకరించారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి నిలకడగా ఉంది. సీనియర్ పోలీసు అధికారి
దీపికా షిండే ఆ బాలిక వివరాలు తెలుసుకోడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాలిక
సరైన జవాబులు చెప్పే పరిస్థితిలో లేదు. దాంతో పోలీసులు, గుర్తు తెలియని బాలికపై
అత్యాచారం జరిగినట్లు కేసు నమోదు చేసారు. పోక్సో చట్టం సెక్షన్ల ప్రకారం కేసు
పెట్టారు.
ఈ కేసులో నేరస్తులను గుర్తించేందుకు,
వారిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు
ఉజ్జయిని పోలీస్ అధికారి సచిన్ శర్మ చెప్పారు. ‘‘వైద్య పరీక్షల్లో అత్యాచారం
జరిగినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసును
త్వరగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసాం. ఈ ఘటన గురించి
ఎవరికైనా తెలిసి ఉంటే, ఎలాంటి సమాచారాన్నయినా మాకు చెప్పాలని ప్రజలను
కోరుతున్నాం’’ అన్నారు సచిన్ శర్మ. నేరం ఎక్కడ జరిగిందన్న సంగతిని ఆయన
ధ్రువీకరించలేదు. ‘‘ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే వివరాలు తెలుస్తాయని
భావిస్తున్నాం’’ అని మాత్రం చెప్పారు.
‘‘బాధిత బాలిక తన గురించి ఎలాంటి వివరాలూ
చెప్పలేకపోతోంది. ఆమె మాట్లాడుతున్న యాసను బట్టి ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్
ప్రాంతానికి చెందినది అయి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
మహిళల పట్ల హింసలో మధ్యప్రదేశ్ రికార్డు
దారుణంగా ఉంది. 2019 నుంచి 2021 మధ్యలో మహిళలు, బాలికల అదృశ్యం కేసులు దేశంలో
ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనే నమోదయ్యాయి. 2021లో దేశంలోనే అత్యధిక
సంఖ్యలో అత్యాచార ఘటనలు నమోదైనది మధ్యప్రదేశ్‌లోనే. 6462 కేసుల్లో సగానికి పైగా
అత్యాచారాలు జరిగింది మైనర్ బాలికల పైనే కావడం గమనార్హం.