ఖలిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో బుధవారం నాడు ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు లారెన్స్, బాంబిహా, ఆర్ష్ దల్లా గ్యాంగులను లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహించిట్లు తెలుస్తోంది.
బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా జిల్లా తత్కాపురా గ్రామానికి చెందిన సారా వ్యాపారి ఇంటిపై ఎన్ఐఏ దాడులు జరిపింది. సారా వ్యాపారి నుంచి ఖలిస్తాన్ గ్యాంగ్‌స్టర్ ఆర్ష్ దాలా భారీ మొత్తం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో కొంత మొత్తం సారా వ్యాపారి చెల్లించినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్దమ్‌సింగ్ నగర్ ప్రాంతంలోని ఆయుధాగారంపై కూడా ఎన్ఐఏ దాడి చేసింది. డెహ్రాడూన్ జిల్లా క్లెమెన్టౌన్ ప్రాంతంలోనూ ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. గన్ హౌస్‌లో ఎన్ఐఏ బృందాలు ఆయుధాలు తనిఖీ చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఖలిస్తాన్ ముఠాలతో 43 మంది సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. వారికి కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ముఠాల ఆస్తుల వివరాలు తమకు అందించాలని ఎన్ఐఏ, ఉత్తరాఖండ్ పోలీసులను కోరారు. ఎన్ఐఏ ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా సభ్యుల ఫోటోలను విడుదల చేసింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుర్పత్వంత్ సింగ్ పానున్కు చెందిన చండీఘర్, అమృత్సర్ ప్రాంతాల్లోని ఆస్తులను జప్తు చేశారు. సెప్టెంబరు 21న పంజాబ్‌లోని దాదాపు వెయ్యికిపైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. గోల్డీ బ్రార్‌ను ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇటీవల కెనడాలోని విన్నింగ్పెగ్లో హత్యకు గురైన సుఖా దునికే హత్యలోనూ ఇతనికి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.