ఇరాక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 113 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. ఓ పెళ్లి వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘోరం చోటు చేసుకున్నట్టు ఇరాక్ స్థానిక మీడియా కూడా వెల్లడించింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఇరాక్‌లోని నినీవాహ్ ప్రాంత గవర్నర్ హసాన్ అల్ అల్లాహ్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 113 మంది చనిపోయినట్టు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశ ముందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఘటన చాలా దురదృష్టకరమని, బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఇరాక్ వైద్య శాఖ అధికార ప్రతినిధి సైఫ్ అల్ బదర్ చెప్పారు. మోసుల్ నగరానికి సమీపంలో, బాగ్దాద్ నగరానికి 400 కి.మీ ఉత్తర ప్రాంతంలోని హమ్‌దాయుయహ్ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
పెళ్లి వేడుకలు జరిగే మందిరంలో టపాసులు కాల్చడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి మండపంలో 1000 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 113 మంది చనిపోయారు. 150 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాక్ వైద్య శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు.