తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిపూర్ణమయ్యాయి.
చివరిరోజైన మంగళవారం ఉదయం చక్రస్నాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి బంగారు
తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి.
మంగళవారం తెల్లవారుజామున 3గంటల నుంచి 6 గంటల వరకూ
వేంకటేశ్వరస్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో స్వామివారు
పల్లకీపై విహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారి పల్లకీని అనుసరించి గోవింద నామాలు ఆలపించారు.
తరువాత స్నపన తిరుమంజన కార్యక్రమం విశేషంగా
జరిగింది. భూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ
వేంకటేశ్వరునికి, సుదర్శన చక్రత్తాళ్వారుకు అర్చక స్వాములు భక్తిశ్రద్ధలతో స్నపన
తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత చక్రస్నానం కన్నులపండువగా జరిగింది.
స్వామివారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నానం చేయించారు.
మంగళవారం రాత్రి మలయప్ప స్వామికి బంగారు తిరుచ్చి
ఉత్సవం జరిగింది. శ్రీదేవీ భూదేవీ సహితుడైన వేంకటేశ్వర స్వామివారిని అర్చక
స్వాములు వైదిక లాంఛనాలతో పూజించారు. భక్తుల గోవింద నామజపంతో తిరుమాడ వీధులు
మార్మోగాయి. చివరిగా రాత్రి 9 నుంచి 10 గంటల వ్యవధిలో ధ్వజావరోహణ కార్యక్రమం
జరిగింది. గరుడ పతాకాన్ని అవరోహణం చేయడంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి.