ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని
కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది
ముర్మును కోరారు. పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల
రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన రాష్ట్రపతిని కలిసారు. పార్టీ అధినేత చంద్రబాబు
అరెస్టు గురించి రాష్ట్రపతికి వివరించారు. జగన్ పాలనలోప్రతిపక్షాలను
అణచివేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేష్
మీడియాతో మాట్లాడారు ‘‘జగన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి జరుగుతున్న అరాచకాలను
రాష్ట్రపతికి వివరించాం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను
వివరించాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో
జైలుకు పంపించారని వెల్లడించాం. మా దగ్గరున్న అన్ని ఆధారాలనూ రాష్ట్రపతికి
అందజేశాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు.
యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించాక.. నన్ను ఇన్నర్ రింగ్‌రోడ్డు
కేసులో ఇరికించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్తో
నాకేంటి సంబంధం. రోడ్డే లేకపోయినా కేసు ఎలా పెట్టారో తెలియడం లేదు’’ అన్నారు.
ఢిల్లీలో తన పర్యటన గురించి వివరిస్తూ ‘‘ప్రతిపక్ష
పార్టీల నేతలను కలిసి రాష్ట్రంలో అరాచకాలపై వివరించాం. రోజుకో వదంతి, రోజుకో కేసులతో
వేధిస్తున్నారు. తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. కేసులకు సంబంధించి ప్రభుత్వం
వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కేసు పెట్టాక అధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు
కోరుతున్నారు. కక్ష సాధింపు తప్ప ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదు. నాకు, మా కుటుంబ సభ్యులకు
ఒక్క పైసా రాలేదు’’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.