మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన వ్యవహారమని, అది అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ గొడవలకు తెలంగాణను వేదిక కానివ్వమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ఆంధ్రా పార్టీలు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత మన్నారు. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు తెలంగాణకు సంబంధం లేదని కేటీఆర్ తేల్చిపడేశారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే ఏపీలో చేసుకోవాలని సూచించారు.
ఏపీ వివాదాలకు హైదరాబాద్లో ర్యాలీలు చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కేటీఆర్ అన్నారు. ర్యాలీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తాము తటస్థంగా ఉన్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు, కోర్టుల్లో న్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
లోకేశ్, పవన్, జగన్ అందరూ నా మిత్రులేనని, ఏపీ తగాదాలు హైదరాబాద్కు ముడిపెట్టవద్దని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్లో ర్యాలీలు జరగలేదన్నారు. ఒకరికి అవకాశం కల్పిస్తే చాలా మంది వస్తారని కేటీఆర్ అన్నారు. ఏపీ నుంచి ఎందరో హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నారు.