దేశ రాజధాని దిల్లీలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలో రూ.25 కోట్ల విలువైన బంగారాన్ని దొంగలు కాజేశారు. ముందస్తు ప్రణాళికతోనే చోరీకి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిల్లీలోని భోగాల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యూయలరీ దుకాణంలోని, స్ట్రాంగ్ రూంకు దొంగలు కన్నం వేశారు. ఆదివారం వ్యాపారం ముగిశాక సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. సోమవారం సెలవు ఉండటంతో మంగళవారం నాడు దుకాణం తెరిచారు. చోరీ జరిగినట్టు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఉమ్రావ్ దుకాణం నాలుగు అంతస్థుల భవనంలో ఉంది. సీసీటీవీ కెమెరాలను నిలిపివేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కు డ్రిల్లింగ్ మెషిన్‌తో కన్నం వేసి, నగలు దోచుకున్నారని పోలీసు అధికారి చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో దాచిన నగలతోపాటు, దుకాణంలోని నగలు కూడా చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే తరహా చోరీ అంబాలాలోని కో ఆపరేటివ్ బ్యాంక్‌లో కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒకే ముఠానా అనే దానిపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.