శ్రీకృష్ణజన్మభూమికి సంబంధించిన
భూవివాదాలు అన్నింటినీ అలహాబాద్ హైకోర్టు మథుర జిల్లా కోర్టు నుంచి తనకు బదిలీ
చేసుకోడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ అక్టోబర్ 3న జరగనుంది.
ఆ మేరకు సుప్రీంకోర్టు తేదీని ఖరారు చేసింది.
ఈ పిటిషన్లో భగవాన్ శ్రీకృష్ణుడి తరఫు
న్యాయవాదిగా వాదిస్తున్న విష్ణుశంకర్ జైన్, షాహీ మసీద్ ఈద్గా మేనేజ్మెంట్ ట్రస్ట్
కమిటీ దాఖలు చేసిన ఫిర్యాదును వీలైనంత త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును
కోరారు. జులై 21న న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ హియరింగ్కే
తీసుకోలేదని వివరించారు.
ఈ కేసు విషయంలో తొందర పడాల్సినదేముందని
జస్టిస్ కిషన్ కౌల్ నాయకత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. దానికి జవాబిస్తూ విష్ణుశంకర్ జైన్, ఇదే
అంశానికి సంబంధించి పలు సివిల్ సూట్లు పెండింగ్లో ఉన్నాయనీ, ఈ అంశం సుప్రీంకోర్టు
ముందు పెండింగ్లో ఉన్నందున అలహాబాద్ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయడం లేదనీ
వివరించారు. అయితే, హైకోర్టు తీసుకునే నిర్ణయంపై తాము ఏ స్టే ఆర్డరూ జారీ చేయలేదని
సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని అక్టోబర్ 3న వింటామని స్పష్టం చేసింది.