Nara Lokesh : అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పేరు
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును చేర్చారు. ఈ కేసులో లోకేశ్‌ను ఏ14గా చేర్చారు. అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. నారా లోకేశ్ పేరును ఈ కేసులో ఏ ఆధారాలతో చేర్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ పేర్లు కూడా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ
కొనసాగుతోంది.
యువగళం పేరు చెబితేనే సీఎం జగన్మోహన్రెడ్డి భయపడుతున్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసనలు తెలిపే వారిపై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. మరలా యువగళం ప్రారంభం అవుతోందని తెలియగానే కుట్రలు మొదలు పెట్టారని లోకేశ్ విమర్శించారు. తనకు అసలు సంబంధం లేని, పనులే మొదలు పెట్టని అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తన పేరు చేర్చడాన్ని లోకేశ్ తప్పుపట్టారు. మరమ్మతుల పేరుతో రాజమండ్రి వద్ద బ్రిడ్జి మూసివేయించారని ఆయన గుర్తుచేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం జనసంద్రమై కదులుతుందని హెచ్చరించారు.