స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు రేపు విచారణ చేపట్టేందుకు సీజే అంగీకరించారు. చంద్రబాబు కేసు ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందనే విషయం సాయంత్రానికి తేలనుంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ప్రజాప్రతినిధులను అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, ఈ సెక్షన్ చంద్రబాబు కేసుకు కూడా వర్తిస్తుందంటూ ఆయన తరపు న్యాయవాదులు ఎస్ఎల్‌పి వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని, కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో కేసు విచారణ జరగనుంది.