కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అండతో
ఖలిస్తానీ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. సోమవారం కెనడాలోని ఒటావా, టొరంటో, వాంకూవర్ నగరాల్లో ఖలిస్తానీ
సమర్థకులు భారత వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు.
ఒటావాలోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్తాన్
అని రాసివున్న జెండాలు ఎగురవేసారు. టొరంటోలో భారత జాతీయ పతాకానికి నిప్పు
పెట్టారు. వాంకూవర్‌లో కూడా భారత రాయబార కార్యాలయం వద్ద వందమందికి పైగా
ఖలిస్తానీలు ప్రదర్శన చేపట్టారు.
ఖలిస్తాన్‌ను సమర్థించే ఒక బృందం ఒటావాలో
భారత హైకమిషన్ బైట, భారత్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టింది. ఖలిస్తాన్ అని
రాసివున్న పసుపు రంగు జెండాను ఎగురవేసారు. ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కావాలంటూ భారత
వ్యతిరేక నినాదాలు చేసారు.
రేష్మాసింగ్ బోలినాస్ అనే యువతి, భారతదేశానికి
వ్యతిరేకంగా దృఢంగా నిలిచినందుకు జస్టిన్ ట్రూడోకు ధన్యవాదాలు తెలిపింది. హర్దీప్
సింగ్ నిజ్జర్ వంటి అమాయకులు, నిర్దోషులను చంపకుండా నిలువరించడానికి భారత్‌పై
ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసింది.
వాంకూవర్‌లో సుమారు 2వందలమంది
వేర్పాటువాద సమర్థకులు భారత హైకమిషన్ కార్యాలయం బైట ఆందోళన చేపట్టారు. టోరంటోలో
రమారమి వంద మంది నిరసనకారులు గుమిగూడారు. భారతదేశపు జాతీయ జెండాను తగులబెట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మోదీ కటౌట్‌ను
చెప్పులతో కొట్టారు.
ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’కు
చెందిన ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశం కెనడా సార్వభౌమాధికారంపై దాడి చేసిందని
ఆరోపించారు. ఎస్ఎఫ్‌జే అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులను భారతదేశం సీజ్
చేసిన రెండురోజులకే ఈ ప్రదర్శనలు జరగడం గమనార్హం.
ఖలిస్తానీ వేర్పాటువాదుల
ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు కెనడా పోలీసులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోవడం
గమనార్హం. భారత జాతీయ పతాకానికీ, దేశ ప్రధానికీ అవమానం జరుగుతున్నప్పుడు కూడా వారు
ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయారు.