బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా ఇంచార్జి, హోం మంత్రి తానేటి వనిత సమీక్షించారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అదనపు జనరేటర్లను, ప్రత్యేక పవర్ లైన్ ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాల్లో చిన్నారులు తప్పిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు.
అమ్మవారి దర్శనం విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. అక్టోబర్ 15వ తేదీ ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు 50,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. మూలా నక్షత్రం రోజున లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. భక్తులకు రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 500 టికెట్‌పై అంతరాలయ దర్శనం ఉండదన్నారు. అక్టోబర్ 26వ తేదీ నుండి యధావిధిగా రూ. 500 టికెట్‌పై అంతరాలయ దర్శనాలు ఉంటాయన్నారు. టికెట్ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్, టోల్గేట్,హోమ్ టర్నింగ్, పున్నమి ఘాట్ , వీయంసి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, స్టేట్ గెస్ట్ హౌస్, మోడల్ గెస్ట్ హౌస్ ఇలా మొత్తం 14 పాయింట్లు వద్ద కరెంటు టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.