భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా శ్రీలంక ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంలా మారిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని ట్రూడో చేసిన దారుణమైన, నిరాధార వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని అలీ సబ్రి స్పష్టం చేశారు. కొందరు ఉగ్రవాదులు కెనడాను స్వర్గధామంలా భావిస్తున్నారని, ఇలాంటి సమయంలో కెనడా ప్రధాని ట్రూడో నిరాధారమైన ఆరోపణలు చేశారని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి వ్యాఖ్యానించారు. శ్రీలంకలో నరమేధం జరుగుతోందంటూ కెనడా తప్పుడు ప్రచారం చేసిందని, మా దేశంలో అలాంటిదేం లేదని అయన అన్నారు.
శ్రీలంకలో నరమేధం జరుగుతోందంటూ కెనడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరవాత ఆ రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా శ్రీలంక నరమేధానికి పాల్పడలేదని గుర్తించినా, కెనడా ప్రధాని మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నరమేధం జరుగుతోందంటూ విమర్శలు చేసినట్టు అలీ గుర్తుచేశారు. ఇప్పటికైనా తమ దేశ సార్వభౌమాధికారంలో కెనడా జోక్యం చేసుకోవడం మానుకోవాలని అలీ సూచించారు. శ్రీలంకలో నరమేధం జరిగిందంటూ కెనడా చేసిన నిరాధార ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వేర్పాటు వాద ఉగ్రవాది నిజ్జర్‌ను ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని ఓ గురుద్వారా సమీపంలో కొందరు దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. భారత ఏజంట్లే ఈ హత్యకు పాల్పడ్డారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.