తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి నేడు చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీవారికి, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నాలు చేసేందుకు భక్తులను అనుమతించారు. గోవింద నామాలతో తిరు వీధులన్నీ మారుమోగాయి. ఇవాళ రాత్రి నిర్వహించే ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకుని పుష్కరిణిలో స్నానం చేయడాన్ని చక్రస్నానం అంటారు. దీన్నే చక్రతీర్థం అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవం అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తికాగానే అవభృధ స్నానం చేస్తారు. భృధం అంటే బరువు, అవ అంటే దించుకోవడం. బరువు దించుకోవడం. యజ్ఞం చేసి అలసిపోయిన వారు స్నానంతో బరువు దించుకుంటారు.యజ్ఞంలో నేరుగా పాల్గొనకపోయినా అవభృధలో పాల్గొంటే యజ్ఞం ఫలం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఉంటారు.