ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై
మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన సంకల్పశక్తి అంతటినీ కోల్పోయిందన్న మోదీ,
కాంగ్రెస్ను ఇప్పుడు కొందరు అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతీ చిన్నపనినీ ఔట్సోర్సింగ్కి ఇచ్చేస్తోందనీ, దాన్ని సొంత
పార్టీ నాయకులు నడపడం లేదనీ మోదీ వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో
బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ ‘‘కాంగ్రెస్
తన సంకల్పబలం అంతటినీ కోల్పోయింది. ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు నోళ్ళకు తాళాలు
వేసుకుని ఉన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ నాశనమైంది, తర్వాత వాళ్ళు దివాలా తీసారు,
ఇప్పుడు వాళ్ళు తమ కాంట్రాక్టును వేరేవారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీని వారి
నాయకులు నడిపించడం లేదు. నినాదాల నుంచి విధానాల వరకూ అన్నింటినీ ఔట్సోర్సింగ్కి
ఇచ్చేసారు. ఆ కాంట్రాక్ట్ కొంతమంది అర్బన్ నక్సలైట్లకి ఇచ్చారు’’ అన్నారు మోదీ.
కాంగ్రెస్ నాయకుల మీద మోదీ తన దాడి పదును
పెంచారు. ‘‘నోట్లో వెండి చెంచాతో పుట్టిన కాంగ్రెస్ నాయకులకు పేదల జీవితాలంటే అసలు
లెక్క లేదు. వాళ్ళకి పేదల జీవితాల్లోకి ప్రవేశించడమంటే అడ్వెంచర్ టూరిజం లాంటి
ప్రయాణం మాత్రమే. పేదల నివాసాలు, కాలనీలు వారికి వీడియో షూటింగ్ తీసుకునే ప్రదేశాలు.
వాళ్ళు గతంలోనూ ఇదే పని చేసారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచానికి మన దేశపు అభివృద్ధి
చెందిన, వెలుగులీనుతున్న కోణాన్ని చూపిస్తోంది’’ అన్నారు.
మోదీ, తన ప్రసంగంలో,
దేశ ప్రజలకు ఏ లోటూ లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ‘‘నా స్వభావం, నా పట్టుదల, నా
దృష్టి మిగతావారి కంటె భిన్నంగా ఉంటాయి. నాకు దేశం కన్న, దేశ ప్రజల కన్న ఏదీ
గొప్పది కాదు. నేను కష్టాలు ఎదుర్కొన్నాను కానీ దేశ ప్రజలకు మాత్రం ఏ లోటూ
రానీయను’’ అన్నారు.
రాబోయే మధ్యప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ కార్యకర్తలు నూరు శాతం శ్రద్ధతో పని
చేయాలని మోదీ కోరారు. ‘‘అభివృద్ధి చెందిన భారత్ కోసం, అభివృద్ధి చెందిన
మధ్యప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం వచ్చే ఐదేళ్ళూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో
ఉండాలి. కాబట్టి ప్రతీ బీజేపీ కార్యకర్తా తమ పూర్తి శక్తియుక్తులు వినియోగించాలి.
అది ప్రతీ కార్యకర్త మీద ఉన్న బాధ్యత’’ అని చెప్పారు.
ఈ ‘‘కార్యకర్తా
మహాకుంభ్’’ సమ్మేళనం బీజేపీ కార్యకర్తల శక్తిని ప్రతిబింబించిందని మోదీ ప్రశంసించారు,
మధ్యప్రదేశ్ దేశానికి హృదయస్థానంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ బీజేపీకే
మద్దతిచ్చారు అని గుర్తు చేసుకున్నారు.
ఈ యేడాది శాసనసభ ఎన్నికలు
జరగబోయే ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. 2018లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్
గెలిచింది. అయితే ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ
అధికారంలోకి వచ్చింది.