మధ్యప్రదేశ్‌లో ఒక మహిళ రోడ్డు పక్కనే ప్రసవించిన
ఘటన చోటు చేసుకుంది. కాలువ పొంగి ప్రవహిస్తుండడం, రహదారి పాడైపోవడంతో ఆంబులెన్స్
గర్భిణీ ఇంటికి చేరుకోలేకపోయింది. దాంతో ఆ మహిళ రోడ్డు పక్కనే ప్రసవించింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ బర్వానీ జిల్లా పన్సేమల్
తహసీల్, ఖామ్ఘాట్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో 27ఏళ్ళ ఒక యువతి గర్భం
దాల్చింది. ప్రసవానికి సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం నొప్పులు వచ్చాయి. అయితే
ఆంబులెన్స్ ఆమె ఇంటికి చేరలేకపోయింది.
ఆ మహిళ సోదరుడు ఠాకూర్ ఈ ఘటన గురించి వివరించాడు.
‘‘నా సోదరికి నొప్పులు రావడంతో ఆంబులెన్స్‌కు కాల్ చేసాము. అయితే రహదారి
బాగోలేకపోవడం, కాలువ పొంగి పొర్లుతుండడంతో ఆంబులెన్స్ మా ఇంటికి రాలేకపోయింది.
అప్పుడు మేము ఆమెను ఒక గుడ్డలో చుట్టి కాలువ దాటించాము. అయితే ఆస్పత్రికి చేరుకునే
లోగానే ఆమె ప్రసవించింది.’’
బాధిత కుటుంబం గర్భవతిని ఒక గుడ్డలో చుట్టి
సుమారు 4 కిలోమీటర్ల దూరం నడిచింది. ఆగిపోయిన ఆంబులెన్స్ అక్కడ ఉంది. ఆ ఆంబులెన్స్‌లో
ఎక్కించి ఆమెను పన్సేమల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. అక్కడ
ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి బర్వానీ జిల్లా ఆస్పత్రికి పంపించారు.
పన్సేమల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోని వైద్యురాలు
అమృత్ బామంకే ‘‘శనివారం సాయంత్రం సుమారు 6 గంటలకు ఆంబులెన్స్‌లో ఒక మహిళను తీసుకువచ్చారు.
ఆమెకు మేము ప్రాథమిక చికిత్స చేసాం. అప్పటికే ఆమె బిడ్డను ప్రసవించింది. మేము మావి
తీసేసాం అంతే. ఆ తర్వాత జిల్లా ఆస్పత్రికి పంపించాం’’ అని చెప్పారు.
తల్లీ బిడ్డా ఇద్దరినీ బర్వానీ జిల్లా ఆస్పత్రిలో
చేర్చారు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా ఆస్పత్రి వర్గాలు తెలియజేసాయి.
బాధిత మహిళ సోదరుడు
ఠాకూర్, తమ గ్రామంలో వీధులను బాగుచేయించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నామనీ,
అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదనీ చెప్పాడు. తన సోదరికి రోడ్డు పక్కన ప్రసవం
అయిన ఘటన, అదేమీ మొదటిది కాదని అతను చెప్పుకొచ్చాడు. గతంలోనూ తమ కుటుంబంలో ఇద్దరు
ముగ్గురు మహిళలకు ఇలాగే రోడ్డు పక్కనే ప్రసవం అయిందని ఆవేదన వ్యక్తం చేసాడు.