తిరుమలలో
భక్తుల రక్షణ కోసం 330 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ తెలిపారు. చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం
ఆదుకుని ఐదులక్షల రూపాయల సాయం అందించినట్లు శాసనమండలిలో చెప్పారు.
భక్తులను క్రూర
మృగాల నుంచి రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలు
వివరించారు. కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు రక్షణ కోసం వెదురు కర్ర అందజేయడంతో
పాటు ఏడో మైలురాయి నుంచి 200 మందిని గుంపులుగా అనుమతిస్తున్నట్లు వివరించారు. 500 మీటర్లు పొడవైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు
చేస్తున్నట్లు పేర్కొన్న మంత్రి, వైల్డ్
లైఫ్ ఇండియా.. డె హ్రాడూన్ అధికారులు సర్వే చేయిస్తున్నామని వారు అందజేసే నివేదిక
ఆధారంగా మరిన్ని చర్యలు చేపడతామన్నారు.
దేవాదాయ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ 83 జీవోను
తీసుకొచ్చినట్లు చెప్పిన మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవుడి భూములు ఆక్రమిస్తే కఠిన
చర్యలు ఉంటాయన్నారు. 24,876 మత సంస్థలకు చెందిన నాలుగు లక్షల 65 వేల ఎకరాల భూమి
దేవదాయశాఖ ఆధీనంలో ఉందన్నారు. 1,44,000 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వగా రూ. 1.55 కోట్ల
ఆదాయం వస్తోందన్నారు.