బిహార్‌లో ఓ దళిత మహిళకు ఘోర అవమానం జరిగింది.
ఆమెను దారుణంగా చితకబాది, దుస్తులు ఊడదీసారు. ఆమె ముఖంపై మూత్రం పోసారు. అప్పు
తీర్చేసి, అదనపు వడ్డీ కట్టడానికి నిరాకరించినందుకు ఆమెకు ఈ అవమానం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం… పట్నా జిల్లాలోని
మోసింపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్
వద్ద రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి, అతని భార్య ఎలాగోలా కష్టపడి అప్పు
తీర్చేసారు. అయితే ప్రమోద్ సింగ్ అదనపు వడ్డీ కోసం వారిని పీడించసాగాడు. దానికి ఆ
దంపతులు నిరాకరించారు. అదనపు వడ్డీ కట్టబోమని స్పష్టంగా చెప్పేసారు. దాంతో
ఆగ్రహించిన ప్రమోద్ సింగ్, అతని కొడుకు, అతని అనుచరులు… ఆ దంపతులపై దాడి చేసారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం…
శనివారం రాత్రి ప్రమోద్ సింగ్, అతని కొడుకు అన్షు, మరో నలుగురు వ్యక్తులు
వారింటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమె ఇంటిముందు పంపునుంచి నీళ్ళు పట్టుకుంటోంది. వారు
ఆమెను కట్టెలతో చితకబాది తమతో లాక్కువెళ్ళారు. ఆమె దుస్తులు విప్పేసారు. ఆమె
నోట్లో మూత్ర విసర్జన చేయమని ప్రమోద్ సింగ్ తన కొడుకు అన్షుకు చెప్పాడు. తండ్రి
చెప్పినట్టే చేసాడా కొడుకు.
బాధితురాలి కుటుంబసభ్యులు ఆమెకోసం వెతకసాగారు.
అప్పటికే అర్ధరాత్రి దాటింది. అంతలో బాధితురాలు ఎలాగోలా వారినుంచి తప్పించుకుని,
తన ఇంటివైపు పరుగెత్తసాగింది. ఆమెను వెతుకుతున్న కుటుంబసభ్యులు ఆమెను గుర్తించి
ఇంటికి తీసుకువెళ్ళారు.
బాధితురాలికి తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె
ఇప్పుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు
చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయింది. ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు
పోలీసులు చెప్పారు.
‘‘మేం ఐదు బృందాలు ఏర్పాటు చేసాం. నిందితుల కోసం
అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే కేసు నమోదు చేసాం. దర్యాప్తు చేస్తున్నాం’’ అని
పట్నా ఎస్ఎస్‌పీ రాజీవ్ మిశ్రా వెల్లడించారు.