కేరళలోని నాలుగు జిల్లాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్
ఇండియా మాజీ కార్యకర్తల ఇళ్ళలో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది.
ఈడీ ఈ ఉదయం నుంచీ త్రిశూర్, ఎర్నాకుళం, మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో సోదాలు
చేస్తోంది.
గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మలప్పురం
జిల్లాలోని పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్ళలో సోదాలు నిర్వహించింది. తయ్యిల్ హంజా,
కలత్తిపరంబిల్ యహుతి, హనీఫా, రంగత్తూర్ పడిక్కపరంబిల్ జాఫర్ తదితరుల ఇళ్ళలో ఎన్ఐఏ
సోదాలు చేపట్టింది. వారందరూ నిషిద్ధ పీఎఫ్ఐ సంస్థకు చెందిన వారే. అంతకుముందు ఎన్ఐఏ
మంజేరీలోని గ్రీన్ వ్యాలీ అకాడెమీని అటాచ్ చేసింది. ఆ అకాడవెమీ, పీఎఫ్ఐ సాయుధ
శిక్షణా కేంద్రాలు అన్నింటిలోకెల్లా పెద్దది. దానికి ముందు, పీఎఫ్ఐకి చెందిన ఐదు
ఆయుధాల శిక్షణా కేంద్రాలను ఎన్ఐఏ జప్తు చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం,
ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం వంటి పనులకు పాల్పడుతున్నందుకు, చట్టవిరుద్ధ కార్యకలాపాల
నివారణ చట్టం – ఉపా కింద ఎన్ఐఏ ఆ ఆయుధ శిక్షణా కేంద్రాలను అటాచ్ చేసింది. మంజేరీ
కేంద్రం పైకి విద్యాసంస్థ ముసుగులో ఉంటూ పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థల ఉగ్రవాద
కార్యకలాపాలకు ఉపయోగపడేది.
కొన్నాళ్ళ క్రితం ఈడీ, ఎన్ఐఏ, కేరళ పోలీసులతో
కలిసి సంయుక్తంగా 10 రాష్ట్రాల్లో ఆపరేషన్ చేపట్టింది. వంద మందికి పైగా పీఎఫ్ఐ నాయకులను
అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 40 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి,
ఒక కేసు నమోదు చేసింది, నలుగురిని అదుపులోకి తీసుకుంది.